నిజామాబాద్ రూరల్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికంగా వరి సాగవుతుండటంతో ఇతర పంటల సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. దీంతో భవిష్యత్‌లో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో రైతులు పంటల మార్పిడి పాటిస్తే లాభాలతోపాటు రాష్ట్రంలో ఆహార భద్రతను కూడా కాపాడవచ్చన్నారు. ఇటీవల సీఎం, మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగును విస్తరించాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రభుత్వం రైతులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవల కేరళ, నాసిక్ ప్రాంతాల్లో పర్యటించిన రైతు కమిషన్, అక్కడి రైతులు కూరగాయల సాగు ద్వారా ఆర్థికంగా లాభపడుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దీనిపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక బడ్జెట్ కేటాయించడానికి సిద్ధంగా ఉందని వివరించారు.


