హస్తం ఆశీర్వాదం ఎవరికో.. | - | Sakshi
Sakshi News home page

హస్తం ఆశీర్వాదం ఎవరికో..

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

నామినేటెడ్‌ విధానంలో సహకార సంఘాల పదవులు ఇచ్చేందుకు కేబినెట్‌ నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సహకార సంఘాల పాలక వర్గాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలను నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల పాలకవర్గ పదవుల కోసం, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవుల కోసం అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయించిన కొన్ని గంటలకే ఎవరికి వారు తమ ప్రయత్నాలు షురూ చేశారు. హైదరాబాద్‌ వెళ్లి కీలక నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కాలపరిమితి సగభాగం అయిపోవడంతో జిల్లాలో నామినేటెడ్‌ పదవులు ఆశించేవారు కళ్లు కాయుల కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సహకార సంఘాల పదవులకు డిమాండ్‌ ఒకింత ఎక్కువగా ఉంది. సర్పంచ్‌ ఎన్నికలు పూర్తి కావడం, పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో పాటు రిజర్వేషన్లు ఎలా వస్తాయోననే లెక్కలేసుకుంటున్న నాయకులు సహకార పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగా సహకార ఎన్నికలు సైతం హోరాహోరీగా జరుగుతాయి. అయితే కేబినెట్‌ నిర్ణయంతో సహకార పదవులు అధికార పార్టీకి గంపగుత్తగా దక్కనుండడంతో ఆశావహులు పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల కోసం ప్రథమ శ్రేణి నాయకులు, డైరక్టర్లు, సహకార సంఘాల చైర్మన్ల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, సహకార సంఘాల డైరక్టర్ల పదవుల కోసం తృతీయ శ్రేణి నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

● కీలకమైన డీసీసీబీ చైర్మన్‌ పీఠం కోసం మాత్రం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ పీఠం కోసం రేసులో తాజా మాజీ డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేష్‌రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మార చంద్రమోహన్‌రెడ్డి, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ మునిపల్లి సాయిరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేసిన తనకు ఈసారి డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం దక్కుతుందని సీనియర్‌ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి ధీమాగా ఉన్నారు. పార్టీ కోసం పాటుపడుతున్న తనకు అవకాశం కల్పిస్తారనే ఆశాభావంతో సాయిరెడ్డి ఉన్నారు. ఇక మరో సీనియర్‌ నేత మార చంద్రమోహన్‌రెడ్డి సైతం రేసులో ఉన్నారు. యువజన కాంగ్రెస్‌ స్థాయి నుంచి దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తుండడంతో పాటు, ఉమ్మడి జిల్లాలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పని చేయడం, పార్టీ అభివృద్ధి కోసం ని రంతరం కృషి చేస్తున్న తనకు డీసీసీబీ చైర్మన్‌ ఇవ్వాలని మార చంద్రమోహన్‌రెడ్డి కోరుతున్నారు. ఇక తాజా మాజీ చైర్మన్‌ కుంట రమేష్‌రెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కేవలం 22 నెలల పాటు మాత్రమే చైర్మన్‌గా వ్యవహరించి టర్నోవర్‌ రూ.1,400 కోట్లు పెంచిన తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని రమేష్‌రెడ్డి అడుగుతున్నారు. బాధ్యత లు తీసుకున్న సమయంలో రూ.1,300 కోట్ల టర్నోవర్‌ ఉండగా, పదవీ కాలం పూర్త య్యేనాటికి రూ.2,700 కోట్లకు పెంచానని, డిపాజిట్లు భారీగా పెంచడంతో పాటు రుణాలు ఎక్కువగా ఇచ్చినట్లు రమేష్‌రెడ్డి చెబుతున్నారు. 15 శాతం ఉన్న ఎన్‌పీఏని 5 శాతానికి తగ్గించినట్లు, ఆర్‌బీఐ నిబంధనల మేరకు 10 శాతం లోపే ఎన్‌పీఏ ఉండాలని, అదేవిధంగా రూ.2 కోట్ల నష్టం నుంచి రూ.21 కోట్ల లాభానికి తీసుకొచ్చానని చెబుతున్న రమేష్‌రెడ్డి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ముఖ్య నాయకులను కోరుతున్నారు.

కుంట రమేష్‌రెడ్డి

మార చంద్రమోహన్‌రెడ్డి

మునిపల్లి సాయిరెడ్డి

సహకార పదవులు నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు గతంలోనే లీకులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌ వెళ్లి జిల్లాకు చెందిన కీలక నేతలను కలిసి తమకు సహకార పదవులు దక్కేలా చూడాలని కోరారు. సహకారం తమకే అందించాలంటూ పలువురు ఆయా నాయకుల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇప్పుడు కేబినెట్‌ నిర్ణయంతో మళ్లీ రాష్ట్ర రాజధానిలో మకాం వేస్తున్నారు.

సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలను నామినేటెడ్‌ విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీ కాంగ్రెస్‌ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేబినెట్‌ నిర్ణయించిన కొన్ని గంటలకే ఎవరికి వారు హైదరాబాద్‌ వెళ్లి కీలక నాయకులను కలుస్తున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ స్థానాల కోసం పోటీ నెలకొంది.

ప్రయత్నాలు ముమ్మరం చేసిన

అధికార పార్టీకి చెందిన ఆశావహులు

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాల కోసం పలువురి పోటీ

రేసులో ముందున్న

మార చంద్రమోహన్‌రెడ్డి,

కుంట రమేష్‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement