నిజామాబాద్ రూరల్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె జిల్లాలో మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి హాజరు కా లేదు. ప్రైవేటు బస్సుల డ్రైవర్, కండక్టర్లు మాత్రమే విధుల్లో పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో ఆర్టీసీ కార్మికులు మహాధర్నా చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తా, దేవీ థియేటర్, ఫులాంగ్ చౌరస్తా నుంచి ఆర్‌ఆర్ చౌరస్తా, న్యాల్‌కల్ రోడ్‌లోని ఒకటో నెంబర్ డిపో వరకు మూతికి గుడ్డ కట్టుకొని మౌన ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సీఎం స్వయంగా జోక్యం చేసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్, ఇంక్రిమెంట్లు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్‌కు కార్మికులు నివాళులర్పించారు. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విడ్డూరం ఉందని పేర్కొన్నారు.
నడిచిన 310 అద్దె బస్సులు
జిల్లాలోని మొత్తం 650 అద్దె బస్సుల్లో శుక్రవారం 310 సర్వీసులు నడిచాయని ఆర్‌ఎం జ్యోత్స్న వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రానున్న రోజుల్లో సర్వీసులను ఇంకా పెంచుతామని ఆర్‌ఎం తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోల్లో డబుల్ చార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పనిగంటలు తగ్గించాలి
రోజుకు 14 నుంచి 16 గంటలపాటు విధులు నిర్వహిస్తున్నాం. దీంతో అనారో గ్యం భారిన పడుతున్నాం. అందరిలాగా మాకూ ఎని మిది గంటల పని విధానం అమలు చేయాలి. మాకు రావాల్సిన రెండు పీఆర్సీ బకాయిలు ఇవ్వాలి. – బి.జీ.రామ్ డ్రైవర్
కొత్త నియామకాలు చేపట్టాలి
కొత్త రిక్రూట్మెంట్‌లు లేక ఉన్న మెకానికల్ సిబ్బందిపై తీవ్రపనిభారం పడుతోంది. సరైన అసిస్టెంట్‌లను ఇవ్వడం లేదు. సమయానికి స్పేర్స్, టూల్స్ సప్లయ్ చేయడం లేదు. పనిగంటలు ఎక్కువై రోగాల భారిన పడుతున్నాం.
– ఆర్. మధుకర్, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్
మూడోరోజు ఆర్టీసీ కార్మికుల
సమ్మె ప్రశాంతం
పాత కలెక్టరేట్ మైదానంలో మహాధర్నా
మూతికి గుడ్డ కట్టుకొని ప్రదర్శన
ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన


