వేగం.. పారదర్శకం | - | Sakshi
Sakshi News home page

వేగం.. పారదర్శకం

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

సుభాష్‌నగర్‌ : యాసంగి 2025–26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఓపీఎంఎస్‌ (ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) సాఫ్ట్‌వేర్‌లో ప్రభు త్వం కీలకమార్పులు చేసింది. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్‌మిల్లులకు ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టారు. అలాగే ప్రతి రైస్‌మిల్లు సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని, వాటి సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించారు. దీంతో రవాణా సమయం, నిల్వ సమస్యలు, కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి మిల్‌ అలాట్‌మెంట్‌, మిల్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌లో మార్పులు చేసేందుకు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారికి (డీసీఎస్‌వో) ప్రత్యేక లాగిన్‌ ఆప్షన్‌ ఇచ్చారు. అదేవిధంగా ఒకసారి మిల్లు కు ధాన్యం కేటాయించిన తర్వాత, మిల్లర్‌ ఏదైనా కారణంతో ధాన్యాన్ని అన్‌లోడ్‌ చేయలేని పరిస్థితి ఉంటే ఆ ధాన్యాన్ని మరో మిల్లుకు కేటాయించే అధికారం కూడా డీసీఎస్‌వోకు అవకాశమిచ్చారు.

సాఫ్ట్‌వేర్‌లో మార్పులపై సమావేశం

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌లో చేసిన మార్పులపై అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో పీడీ సాయన్న, టెక్నికల్‌ స్టాఫ్‌, కొనుగోలు కేంద్రాల సీఈవోలు, ఏపీఎంలతో గూగుల్‌ మీట్‌ సమావేశాన్ని నిర్వహించారు. సాఫ్ట్‌వేర్‌లో జరిగిన మార్పులను వివరించి, సంబంధిత సందేహాలను నివృత్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం చేసినట్లు వారు తెలిపారు.

ధాన్యం సేకరణ సాఫ్ట్‌వేర్‌లో కీలక మార్పులు

కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికే..

సమీపంలోని మిల్లులకే

వడ్లు తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement