నిజాంసాగర్(జుక్కల్): తనకు భర్త కావాలంటూ, అత్తింట్లోకి రానివ్వాలంటూ ఓ మహిళ తన పిల్లలతో కలిసి శుక్రవారం నిరసన చేపట్టింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన మదునాల మహేందర్‌గౌడ్‌కు 2020లో తెల్గాపూర్ గ్రామానికి చెందిన కావ్యతో వివాహం జరిగింది. కొన్ని నెలల నుంచి భర్తతోపాటు అత్తామామలు వేధించడంతో కావ్య పుట్టింటింటికి వెళ్లింది. అప్పటికే ఆమె గర్భిణి కాగా, ఇద్దరు పండంటి మగ బిడ్డలకు జన్మనిచ్చింది. నెలలు గడుస్తున్నా అత్తింటి వారు కాపురానికి తీసుకు వెళ్లకపోవడంతో పెద్దల సమక్షంలో పంచాయితీలు, కోర్టులో కేసులు పెట్టుకున్నారు. అయినా ఆమెను అత్తింటివారు ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో శుక్రవారం ఆమె తన పిల్లలతో కలిసి అత్తింటి వద్ద నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించినట్లు సమాచారం.


