బాన్సువాడ: బాన్సువాడలో శుక్రవారం నిర్వహించిన బేతాళస్వామి కుస్తీ పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. బేతాళస్వామి జాతరలో భాగంగా రెండో రోజు కుస్తీ పోటీలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మల్లయోధులు తరలి వచ్చారు. మహారాష్ట్ర నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చి కుస్తీ పట్టడం చూపరులను ఆకట్టుకుంది. కుస్తీ పోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ నగదు అందజేశారు. కుస్తీ పోటీలను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిలకించారు. మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


