మా దృష్టికి వచ్చింది..
● గ్రామాభివృద్ధి పేరిట ఇసుక
పాయింట్ల వద్ద డబ్బుల వసూళ్లు
● ప్రభుత్వ ధరకు మూడింతలు ఎక్కువ ధరతో విక్రయిస్తున్న నిర్వాహకులు
మోర్తాడ్(బాల్కొండ): ఇళ్ల నిర్మాణాల కోసం కావాల్సిన ఇసుక సుమారు మూడింతల ధరకు లభ్యమవుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురువుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు ఇతర భవనాల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సులభతరంగా అందించడానికి ప్రభుత్వం మన ఇసుక వాహనం పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. కానీ గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)ల జోక్యంతో ఇసుక ధరకు రెక్కలు రావడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది.
రూ.1,212 నుంచి రూ.5,000కు..
జిల్లాలోని పెద్దవాగు, కప్పలవాగు, పసుపు వాగు, పూలాంగ్ వాగుల నుంచి ఇసుకను తరలించడానికి గతంలోనే భూగర్బ ఖనిజాల శాఖ అనుమతి ఇచ్చింది. ఆయా వాగులు మోర్తాడ్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, సిరికొండ, డిచ్‌పల్లి, ఏర్గట్ల, నవీపేట్, వేల్పూర్, బోధన్ మండలాల్లో ఉన్నాయి. అధికారిక పాయింట్ల నుంచి ఇసుకను తరలించుకునేవారు తమ మొబైల్ ఫోన్‌లలో మన ఇసుక వాహనం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. తాము నిర్మించే ఇంటి వివరాలు, గ్రామం, మండలం వివరాలను నమోదు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఒక్కో ట్రిప్పుకు ఎన్ని ట్రిప్పులు అవసరం ఉంటే అంత మొత్తంను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ట్రిప్పుకు రూ.1,212, ఇతర భవనాలకై తే రూ.1,773 చొప్పున ఖర్చు అవుతుంది. కానీ ఇసుక పాయింట్ల వద్ద గ్రామాభివృద్ధి పేరిట వీడీసీలు నిర్వాహకుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.1వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తుండటంతో, నిర్వాహకులు ఒక్కో ట్రిప్పు ఇసుకను వినియోగదారులకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకూ విక్రయిస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టిన వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు అధికారుల మాటను ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదు. తాము అడిగినంతగా ఇస్తే తప్ప ఇసుక తరలించడానికి అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం గ్రామాభివృద్ధి కమిటీలపై ఉక్కుపాదం మోపుతే తప్ప ఇసుక ధరలు తగ్గే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తంలోనే ఇసుకకు చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ ఆశయానికి ప్రజలు సహకరించాలి. ఇసుకను ప్రభుత్వం సులభతరం చేస్తే ఇతరులు మాత్రం అధికంగా వసూలు చేయడం సరికాదు.
–మల్లయ్య, తహసీల్దార్, ఏర్గట్ల


