తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

సంబంధిత అధికారులు, సిబ్బంది

నిరంతరం పర్యవేక్షణ చేయాలి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

బోధన్‌: వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సరిపడా తాగునీటి సరఫరాను అంతరాయం లేకుండా అందించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈలు, ఎంపీవోలు ఇతర శాఖల అధికారులతో తాగునీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాబోయే రెండు, మూడు నెలలు ఎంతో కీలకమైనందున తాగునీరు సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. ఏ ఒక్క ప్రాంతంలోను నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి చేతిపంపులు, బోరుబావులకు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. పైప్‌లైన్స్‌, వాల్వ్‌లకు నష్టం కలిగేలా వ్యవహరించే వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన తరహాలోనే అనంతగిరి, నెహ్రునగర్‌ గ్రామాలకు ఆన్‌లైన్‌ బూస్టర్‌ సిస్టం ఏర్పాటు చేయాలని తెలిపారు. బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రాజేందర్‌, డీపీవో శ్రీనివాస్‌రావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్‌డీవో సాయన్న, ఈఈలు రాకేశ్‌, స్వప్న, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, నాగరాజు పాల్గొన్నారు.

‘యంగ్‌ ఇండియా’ స్కూల్‌ స్థలం పరిశీలన

బోధన్‌రూరల్‌: బోధన్‌ శివారులోని బెల్లాల్‌ ప్రాంతంలో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌’, వసతి గృహ సముదాయం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. స్థలాన్ని ఖరారు చేసినందున, శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, డీఈ రాందాస్‌, తహసీల్దార్‌ విఠల్‌, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement