ఇసుక టిప్పర్లను అడ్డగించిన వ్యక్తుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇసుక టిప్పర్లను అడ్డగించిన వ్యక్తుల అరెస్టు

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

బోధన్‌ టౌన్‌ (బోధన్‌): బోధన్‌ పట్టణ శివారు బాబా గార్డెన్‌ సమీపంలో ఇసుక టిప్పర్లను అడ్డగించి, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మంజీరా నది పరీవాహక ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను పట్టణ శివారులోని బాబా గార్డెన్‌ వద్ద వసీం ఖురేషీ, సయ్యద్‌ ఓవేస్‌, షేక్‌ అర్బజ్‌, షేక్‌ అల్మాస్‌ ఈ నెల 22న సాయంత్రం రెండు ఆటోలలో వచ్చి ఇసుక టిప్పర్‌ను అడ్డుకున్నారు. డబ్బులు డిమాండ్‌ చేయగా డ్రైవర్‌ నిరాకరించడంతో నిందితులు రాళ్లతో టిప్పర్‌ అద్దాలను పగులగొట్టి, డ్రైవర్‌ను గాయపర్చారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో టిప్పర్‌ డ్రైవర్‌ ఈ దాడిని ఫోన్‌లో రికార్డు చేస్తుండగా అతనిపై కూడా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement