ఇందల్వాయి: మండలంలోని లోలం గ్రామంలో కొద్దిరోజులుగా గ్రామస్తులకు, కొందరు ముదిరాజ్ కులస్తులకు మధ్య వివాదానికి కారణమవుతున్న భూమిని ఆర్డీవో రాజేంద్రకుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబరు 208, 209లో వివాదానికి కారణం అవుతున్న భూమికి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమిని పరిశీలించి సమగ్ర నివేదికను రూపొందించి అందజేయనున్నట్లు తెలిపారు. అంతవరకు గ్రామంలో ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించకూడదని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ బాలయ్య, సర్వేయర్ రంజిత్, ఆర్‌ఐ గంగాప్రసాద్, ఎస్సై సందీప్ ఉన్నారు.


