మాక్లూర్: రాష్ట్రంలోనే అతిపెద్ద సొసైటీగా పేరుగాంచిన మాక్లూర్ సొసైటీలో ఇప్పటికే రూ. 3 కోట్ల 23 లక్షల అవినీతి జరిగి రైతులను అయోమయంలోనికి నెట్టివేసింది. తాజాగా ఇదే సొసైటీకి చెందిన కార్యదర్శి రతన్ మరో రూ.5 లక్షల కుంభకోణానికి తెరలేపాడు. సొసైటీకి సంబంధించి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)కు 700 మంది రైతుల సభ్యత్వం చేయాల్సి ఉంది. ఒక్కో రైతు నుంచి సభ్యత్వ రుసుము రూ.2 వేల చొప్పున మొత్తం రూ.14 లక్షలు సేకరిస్తే, కేంద్ర ప్రభుత్వం వాటికి మరో రూ.14 లక్షలు కలిపి రైతులు వ్యాపారం చేసుకునేందుకు ఇస్తోంది. కానీ, సొసైటీ కార్యదర్శి రతన్ మాత్రం రైతుల వద్ద సభ్యత్వ రుసుం తీసుకోకుండా నేరుగా సొసైటీ నిధుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.4.83 లక్షలు తీసి ఒక్క గుంజ్లి గ్రామంలోనే 250 మందికి, ఇతర గ్రామాల్లోని పలువురు రైతులకు సభ్యత్వం కల్పించినట్లు సమాచారం. సొసైటీ నిధులను స్వలాభం కోసం ఉపయోగించి తనకున్న లారీలతో వ్యాపారం చేసుకునేందుకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతులకు ముప్పుతిప్పలు..
ప్రస్తుత కార్యదర్శి గతంలో పనిచేసిన ఇందల్వాయి సొసైటీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని, అతన్ని మాక్లూర్‌కు కేటాయించొద్దని రైతులు మహాజన సభలో తీర్మానించారు. అయినప్పటికీ డీసీవో శ్రీనివాస్ పట్టుపట్టి అతన్నే కొనసాగించటంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీసీవో అండతోనే కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, కార్యదర్శికి సొంతంగా ఆరు లారీలు ఉన్నట్టు సమాచారం. వాటిని అడ్డంపెట్టుకొని మాక్లూర్ సొసైటీ పరిధిలో ఉన్న 13 కొనుగోలు కేంద్రాల్లో కార్యదర్శి రతన్ చక్రం తిప్పుతూ మాటవినని రైతుల వరి ధాన్యం కాంటాలు జరపకుండా ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. బస్తాకు రూ.15 ఉన్న కమీషన్ రూ. 20 వరకు వెళ్లడానికి సదరు కార్యదర్శే కారణమని రైతులు భావిస్తున్నారు. కలెక్టర్ ఈ విషయమై జోక్యం చేసుకొని రూ.4.83లక్షల సొసైటీ నిధులను పక్కదారి పట్టించిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సొసైటీ నిధులను ఎఫ్‌పీవో
సభ్యత్వాలకు మళ్లించిన కార్యదర్శి
గతంలో కార్యదర్శి తమకొద్దని తీర్మానించిన రైతులు
ఉన్నతాధికారి అండతో
ఇష్టారాజ్యంగా కార్యదర్శి
వ్యవహారం!


