● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్: ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో గురువారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం వారీగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని సమీక్షిస్తూ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఓటర్ మ్యాపింగ్‌లో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన పెంపొందించేలా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియపై ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని, వారం రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సెల్ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ లీగల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అడ్వకేట్స్ సహకార సొసైటీలో నాలుగు డైరెక్టర్ పదవుల కోసం శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. బైలా ప్రకారం, సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని, వీరిలో ఏటా నలుగురు చొప్పున పదవి విరమణ చేస్తారని, ఆ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. సొసైటీలో ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి కోర్టులకు చెందిన న్యాయవాదులు మొత్తం 395 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. రెంజర్ల సురేష్, దిలీప్, చింతకుంట సాయిరెడ్డి, పి. నర్సారెడ్డి, మొహ్రానంద్ పవార్ ఎన్నికల బరిలో ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయవాద సొసైటీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో గురువారం భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. సమాజహితం కోసం భగీరథ మహర్షి చేసిన కృషిని, పురాణ ఇతిహాసాలలో భగీరథుని ప్రాశస్త్యాన్ని గుర్తుచేశారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి నర్సయ్య, సహాయ అధికారి సుజయ్, బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌బీ సీఐగా పనిచేస్తున్న శ్రీశైలంకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. కొన్నేళ్లుగా జిల్లా పోలీస్ శాఖలోని ఎస్‌బీ విభాగంలో పనిచేస్తున్నారు.


