తాడ్వాయి(ఎల్లారెడ్డి) : అప్పుల బాధలు భరించలేక ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయికి చెందిన గాండ్ల శ్రీకాంత్(22)అనే యువకుడికి అప్పుల భారం ఎక్కువడంతో మానసిక ఆందోళన గురయ్యాడు. తల్లి స్వరూప వైద్య చికిత్స కోసం రూ. 2 లక్షల అప్పులు చేశాడు. స్వరూప భర్త సత్యం 20 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. తల్లి స్వరూప ఈనెల 19న హైదరాబాద్‌లో ఉన్న కూతురు వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా చూసుకొని జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్ ఈ నెల 22న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రైలు కిందపడి మరొకరు..
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హమాల్‌వాడికి చెందిన అనిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఓ యువతిని ప్రేమించగా, తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన అనిల్ గురువారం నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో కరీంనగర్ డెమో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు..
బాన్సువాడ: బీర్కూర్ మండలం కిష్టాపూర్‌లో మహేశ్(26) అనే యువకుడు గురువారం ఉదయం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మహేశ్ కుటుంబసభ్యులు అద్దెఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో విద్యుత్ సమస్య రావడంతో మహేశ్ స్వయంగా సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలి కిందపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


