అద్దె భవనంలో కొనసాగుతున్న రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2025 డిసెంబరు నెలలోనే ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం సదరు జీవోలో పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం నాడు మొదలుపెట్టిన కసరత్తు మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పటికీ ఆయా కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సీనియర్ సిటిజన్లు ఎక్కువగా సందర్శించే కార్యాలయాలు గ్రౌండ్ ఫ్లోర్‌లలోనే నడిపించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికార యంత్రాంగం లేకపోవడం గమనార్హం.
● బోధన్‌లోని శక్కర్‌నగర్ నిజాంషుగర్ ఫ్యాక్టరీకి చెందిన పాత భవనంలో అద్దె ప్రాతిపదికన డివిజన్ రవాణా శాఖ కార్యాలయం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణం స్థల సమస్య వల్ల ప్రతిపాదనలకే పరిమితమైంది.
● ఆర్మూర్‌లోని మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం ఇరుకు అద్దె భవనంలో కొనసాగుతోంది. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారికి పరీక్షలు నిర్వహించేందుకు సరైన స్థలం అందుబాటులో లేదు. దీంతో అద్దె భవనం సమీపంలోని ప్రైవేట్ ప్లాట్లల్లో వాహనాలను నిలిపి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
● మోపాల్ ఎంపీడీవో, పోలీసు స్టేషన్, ఐకేపీ కార్యాలయాలు గత పదేళ్లుగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఎంపీడీవో కార్యాలయాలు సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో పలుసార్లు భవనాల యజమాని తాళం వేశారు. ఎంఈవో కార్యాలయం నిజామాబాద్‌లో నడిపిస్తున్నారు.
● మెండోరా, ముప్కాల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ అభివృద్ధి కమిటీ భవనాల్లో నడుస్తున్నాయి. ఏర్గట్ల తహసీల్దార్ కార్యాలయం, మోర్తాడ్‌లోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం అద్దె భవనంలో ఉన్నాయి.
● ఇందల్వాయి మండలంలో తొమ్మిది సంవత్సరా ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవ నాల్లోనే కొనసాగుతున్నాయి. తహసీల్, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో, పోస్టాఫీస్, ఐకేపీ కార్యాలయాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. మండల కేంద్రం శివారులో 787 సర్వే నంబర్‌లో 2019లో ప్రభుత్వ కార్యాలయాల కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అయితే ఇంతవరకు కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు.
● జిల్లాలో 1,501 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 611 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 177 అంగన్‌వాడీ కేంద్రాలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నా యి. ఒక్కో భవనానికి అద్దె రూ.6 వేల చొప్పున నెలకు రూ.10.62 లక్షలు చెల్లిస్తున్నా రు. రూరల్ ప్రాంతాల్లో 434 అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రానికి రూ.2వేల చొప్పున నెలకు రూ.8.68 లక్షలు చెల్లిస్తున్నారు.
అద్దె భవనంలో ఉన్న జిల్లా
రిజిస్ట్రేషన్ కార్యాలయం
అద్దె భవనంలో ఉన్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయం
అద్దె భవనంలో జిల్లా బీమా కార్యాలయం
అద్దె భవనంలో కాలుష్య నియంత్రణ మండలి
ప్రాంతీయ కార్యాలయం
నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రైవేటు కమర్షియల్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బోధన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అద్దె భవనంలోనే ఉంది. ఇదిలా ఉండగా బోధన్ సబ్ రిజిస్టార్ కార్యాలయం అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని పలుసార్లు తాళం వేయడం గమనార్హం. ఇప్పటికీ నెలకు రూ.72 వేల చొప్పున రెండున్నర సంవత్సరాల అద్దె చెల్లించాల్సి ఉంది. పైగా ఈ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. నిజామాబాద్‌లోని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో కొనసాగుతోంది. నిజామాబాద్ డివిజన్ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సుభాష్‌నగర్‌లో అద్దె భవనంలో నడుస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయని యంత్రాంగం
మధ్యలోనే నిలిచిపోయిన కసరత్తు
జిల్లా కేంద్రంతో పాటు పలు
మండలాల్లోనూ ఇదే పరిస్థితి


