ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు

గోరటి వెంకన్న

ఉత్సాహంగా తెలంగాణ యూనివర్సిటీ

వార్షికోత్సవం

తెయూ(డిచ్‌పల్లి): విద్యతోపాటు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, అప్పుడే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ, ప్రజా గాయకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న విద్యార్థులకు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ వార్షికోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన గోరటి వెంకన్న తనదైన శైలి పాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి విద్యార్థులు భూమిక లాంటి వారని, విద్యార్థుల భాగస్వామ్యం లేకుండా చరిత్రలో ఏ ఉద్యమం విజయవంతం కాలేదన్నారు. విద్యార్థులు తమ కుటుంబ ఆర్థికస్థితిగతులను తప్పకుండా పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాలన్నారు. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండాలని, మరీ ముఖ్యంగా మద్యం, మాదకద్రవ్యాల మత్తుకు బానిసలు కాకూడదని హితవు పలికారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ యాదగిరిరావు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, అభివృద్ధి విద్యార్థుల ఎదుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను చేరుకొని కుటుంబాలకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు.

రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. వేడుకల్లో వర్సిటీ కల్చరల్‌ ఆక్టివిటీస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కే లావణ్య, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాంబాబు, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆరతి, లా కళాశాల ప్రిన్సిపల్‌ కె.ప్రసన్న రాణి, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డైరెక్టర్‌ బాలకిషన్‌, తెయూ పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు, దండు స్వామి తదితరులు పాల్గొన్నారు.

పాటలతో విద్యార్థులను ఉత్తేజపరుస్తున్న

ఎమ్మెల్సీ, ప్రజాగాయకుడు గోరటి వెంకన్న

మాట్లాడుతున్న తెలంగాణ యూనివర్సిటీ

వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరిరావు

Advertisement
 
Advertisement
Advertisement