గురుకులాన్ని ఆర్మూర్‌కు తరలిస్తాం | - | Sakshi
Sakshi News home page

గురుకులాన్ని ఆర్మూర్‌కు తరలిస్తాం

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నూత్‌పల్లి జ్యోతీబా ఫూలే పాఠశాల తనిఖీ

డొంకేశ్వర్‌/ఆర్మూర్‌ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా డొంకేశ్వర్‌ మండలం నూత్‌పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతీబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, డార్మెటరీ, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పాఠశాలను ఆర్మూర్‌ పట్టణానికి తరలించే ప్రతిపాదనకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ఆమోదం ఉందని నిర్వాహకులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్‌ ఆర్మూర్‌ పట్టణంలోని ప్రతిపాదిత భవనాన్ని సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన చేశారు. ప్రస్తుతం నూత్‌పల్లిలో ఉన్న భవనం కంటే ఇది సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలుపగా, అవసరమైన మరమ్మతులు జరిపించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్మూర్‌లోని నూతన భవనంలోకి పాఠశాలను మారుస్తున్న విషయాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ, వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. అంతకుముందు కలెక్టర్‌ 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందించారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా? అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, ఆర్‌సీవో సత్యనాథ్‌ రెడ్డి, ఆర్మూర్‌ తహసీల్దార్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement