హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలకు రాష్ట్ర హైకోర్టు చెక్‌ పెట్టిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును యావత్‌ తెలంగాణ సమాజం హర్షిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలు పాలన చేతగాక ప్రజల దృష్టి మళ్లించేందుకేననే రాజకీయ ప్రేరేపిత అభియోగాలని రుజువైందన్నారు. కేసీఆర్‌ మీద కమిషన్‌ పేరుతో వేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ ఎత్తుగడ హైకోర్టు ముందు నిలవలేదన్నారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్‌ పట్ల వ్యవహరించిన తీరు ప్రాథమిక న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం కు దరదని హైకోర్టు బల్లగుద్ది స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పు మేరకు కేసీఆర్‌ సహా సాక్షులుగా పిలిచినవారిపై చర్యలు చేపట్టడం కుదరదన్నారు. సాక్షులుగా పిలిచినవారిని విచారణ పేరుతో అగౌరవపరుస్తూ, ఏకపక్షంగా తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కుదరదని తేలిందన్నారు. హైకోర్టు ధర్మాసనం తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వ చెంపలు పగలగొట్టే తీర్పు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రతిష్టాత్మక నిర్మాణమని బాజిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టును బదనాం చేయాలనే కుట్రలు పనిచేయలేదన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనవసర రాజకీయ ఆరోపణలను విరమించుకోవాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు.

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక న్యాయ విరుద్ధం

రేవంత్‌రెడ్డి కుట్రలకు చెక్‌ పెట్టిన న్యాయస్థానం

విలేకరులతో మాజీ ఎమ్మెల్యే

బాజిరెడ్డి గోవర్ధన్‌

Advertisement
 
Advertisement
Advertisement