క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

కోనేరులో పడి వృద్ధురాలి మృతి

రామారెడ్డి: ప్రమాదవశాత్తు కోనేరులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన రామారెడ్డి మండల పరిధిలోని మద్దికుంటలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మనోహరాబాద్‌ గ్రామానికి చెందిన గడ్డం నర్సవ్వ(70) మద్దికుంటలో ఉన్న బుగ్గ వృద్ధాశ్రమంలో గత ఆరేళ్లుగా నివసిస్తోంది. బుధవారం ఉదయం 5 గంటలకు నిద్రలేచిన నర్సవ్వ తోటి వారితో కోనేరులో స్నానం చేసి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. గంట గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో తోటి వారు కోనేరు వద్దకు వెళ్లి చూడగా, నర్సవ్వ నీటిలో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తు కాలుజారి కోనేరులో పడిపోవడంతోనే ఆమె మృతిచెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో వలస కూలీ ..

మోపాల్‌: మండలంలోని సిర్‌పూర్‌ ఇటుక బట్టీలో పని చేస్తున్న నీలేద్రి నాగ్‌ (35) అనే మహిళ గుండెపోటుతో మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రంలోని నవుపడా జిల్లా సిర్ణాపల్లి మండలం కందుకూనా గ్రామానికి చెందిన పితంబర్‌ నాగ్‌ తన భార్య నీలేద్రి నాగ్‌, ముగ్గురు పిల్లలతో కలిసి సిర్‌పూర్‌లో ఉన్న ఇటుక బట్టీలో పని చేసేందుకు గతేడాది డిసెంబర్‌లో వచ్చారు. బుధవారం ఉదయం బట్టీలో పని చేస్తుండగా నీలేద్రి నాగ్‌కు ఛాతిలో నొప్పితో కింద పడిపోయింది. ఆమె భర్త వెంటనే ఆటోలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త పితంబర్‌ నాగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే భార్య ..

మాక్లూర్‌: మండలంలోని వల్లభాపూర్‌ వాస్తవ్యుడు, దివంగత కంటోన్మెంట్‌ మాజీ ఎమ్మెల్యే జీ సాయన్న భార్య గీత(70) బుధవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. గ్రామ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement