● తాము తీసుకోలేమంటున్న మిల్లర్లు
● సేకరణకు ముందుకు రాని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు
● ఆందోళనలో రైతులు
మోర్తాడ్(బాల్కొండ): దొడ్డు రకం ధాన్యం సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినా సేకరించేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా రైస్ మిల్లర్లు. అయితే రైస్ మిల్లుల నిర్వాహకులు మాత్రం తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి దొడ్డు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదు.
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా దొడ్డు రకం ధాన్యాన్ని ఎగుమతి చేయలేకపోతున్నామని, ప్రభుత్వానికి ఇద్దామన్నా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దొడ్డు ధాన్యంలో నూకశాతం ఎక్కువగా వస్తుందని అంటున్నారు. ఒక వేళ దొడ్డు రకం ధాన్యాన్ని తీసుకున్నా నిల్వ చేసుకునేందుకు అనువైన పరిస్థితులు లేవని తదితర కారణాలు చెబుతున్నారు. దీంతో యాసంగి సీజన్‌లో దొడ్డు రకం వరిని సాగు చేసిన రైతులకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
సుమారు 59వేల ఎకరాల్లో సాగు
యాసంగి సీజన్‌లో సన్న రకాలను సాగు చేసే పరిస్థితులు ఉన్నా వాతావరణం, సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు దొడ్డు రకాలను సాగు చేశారు. ఈ సీజన్‌లో సుమారు 59,834 ఎకరాల్లో దొడ్డు రకాలను సాగు చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.71లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారులకు సన్న బియ్యంను పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో దొడ్డు రకాలను తాము తీసుకున్నా ప్రభుత్వానికి ఇచ్చే బియ్యంగా సన్న బియ్యం ఇస్తుండటంతో దొడ్డు రకాలను ఏమి చేయాలో అర్థం కావడం లేదని మిల్లర్లు చెబుతున్నారు. దొడ్డు రకాలను ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతగా ఎగుమతి లేకపోవడం గమనార్హం. మిల్లర్ల తీరుతో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలు తూకం వేయడానికి నిర్వాహకులు అంగీకరించడం లేదు. ప్రభుత్వం స్పందించి దొడ్డు రకాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌కు చెందిన రైతు గంగాధర్ తన పొలంలో యాసంగి సీజన్‌కుగాను దొడ్డు రకం వరిని సాగు చేశాడు. 185 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇటీవల మోర్తాడ్‌లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకువెళ్తే.. దొడ్డు రకాలను ఇప్పట్లో కొనుగోలు చేయలేమని నిర్వాహకులు చెప్పారు. దొడ్డు రకం ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్‌లోడింగ్ చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ముఖం చాటేస్తున్నారు. ఇది ఒక్క గంగాధర్‌కు ఎదురైన ఇబ్బంది కాదు. ఈ సీజన్‌లో దొడ్డు రకాలు సాగు చేసిన ప్రతి రైతూ దొడ్డురకం ధాన్యాన్ని విక్రయించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.


