క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి

బాన్సువాడ: చేపల వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. బీర్కూర్‌ ఎస్సై రాములు తెలిపిన వివరాలు ఇలా..బీర్కూర్‌ మండలం రైతునగర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (45) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం చించొల్లి గ్రామంలో ఉన్న చెరువులో చే పలు పట్టేందుకు వెళ్లాడు.చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు గుంతలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం శ్రీనివాస్‌ మృతదేహాన్ని చెరువులో నుంచి బ యటకి తీశారు.పంచనామా చేపట్టి వివరాలు సేకరించారు. మృతుడి భార్య సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రైలు ఢీకొని వృద్ధురాలు..

మోర్తాడ్‌(బాల్కొండ): మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ శివారులోని రైల్వేపట్టాలను ఓ వృద్ధురాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా..సంతోష్‌నగర్‌కు చెందిన దండుగుల లక్ష్మమ్మ(80) అనే వృద్ధురాలు శనివారం దొన్కల్‌ శివారులోని రైల్వేపట్టాలను దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ హన్మాగౌడ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

కెనాల్‌లో నీటమునిగి రైతు..

నిజామాబాద్‌ రూరల్‌: మండలంలోని కొత్తపేట్‌ గ్రామంలోగల కెనాల్‌లో ఓ రైతు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కొత్తపేట్‌ గ్రామానికి చెందిన నిరడి అబ్బులు(43) అనే రైతు శుక్రవారం సాయంత్రం తన పొలానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. పొలం పక్కన ఉన్న కెనాల్‌లో అతడు విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కెనాల్‌లోని మోటార్‌ జాలికి చెత్త పేరుకుపోవడంతో దానిని తొలగించడానికి మృతుడు నీటిలోకి వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలుజారి మునిగిపోయినట్లు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు..

బాన్సువాడ రూరల్‌: మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నిజాంసాగర్‌ మండలం గాలిపూర్‌కు చెందిన జండ గంగారాం(35) శనివారం రాత్రి టీవీఎస్‌ ఎక్సెల్‌పై గాలిపూర్‌ వైపు బయలుదేరాడు. తిర్మలాపూర్‌ గ్రామ సమీపంలోని బాన్సువాడ–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై అతడి ఎక్సెల్‌ను బాన్సువాడ వైపు అతివేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో గంగారాం ఘటన స్థలంలోనే మృతి చెందాడు. రోడ్డు విస్తరణ పనులకు వినియోగిస్తున్న టిప్పర్లు అతివేగం, అజాగ్రత్తతో నడుపుతుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement