లింగంపేట(ఎల్లారెడ్డి): రెండు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉండగా, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. లింగంపేట మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన బందరబోయిన దుర్గయ్య (48)కు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు నవీన్, కిరణ్, కూతురు జ్యోతి ఉన్నారు. కాగా ఈనెల 12న ఆదివారం పెద్ద కుమారుడు నవీన్ పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో దుర్గయ్య ఇంట్లో పెళ్లి పనుల్లో బిజీ ఉండగా శుక్రవారం సరుకులు కొనుగోలు చేయడానికి లింగంపేటకు బైక్‌పై బయలుదేరాడు. మండలంలోని అయ్యపల్లి గ్రామ శివారులో అతడి బైక్‌ను ఓ లారీ వెనుకనుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు. రెండు రోజుల్లో ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉండగా దుర్గయ్య అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న లింగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
● రెండు రోజుల్లో కొడుకు పెళ్లి
● సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
● లింగంపేట మండలంలో ఘటన


