● గుడిమెట్ మహాదేవ్ ధర్మపీఠం
సద్గురు మహదేవ్ స్వామీజీ
● సాలూరలో హిందూ సమ్మేళనం
బోధన్: సనాతన ధర్మ రక్షణకు హిందూబంధువులంతా జాగృతం కావాలని గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠం సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఆదివారం రాత్రి సాలూర మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి మహాదేవ్ స్వామీజీ, మల్లారం ఆశ్రమ పీఠం స్వామి బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్, ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ కార్యవాహ ముత్యం విచ్చేశారు. ముందుగా జ్యోతిప్రజ్వలన, అనంతరం హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతో మంది మహానీయులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంట్లో భగవద్గీత గ్రంథం తప్పనిసరిగా ఉండాలన్నారు. తమ పిల్లలను ఛత్రపతి శివాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మిబాయి, అహల్య బాయిలా తయారు చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజ్ఞశ్రీ హైస్కూల్, వాగ్ధేవి విద్యానికేతన్, నీలా జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. హిందూ జనజాగరణ సమితి అధ్యక్షుడు ముట్టెన్ ప్రకాశ్, నిర్వాహణ కార్యదర్శి నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు.
హిందూ సమాజ సంఘటితమే
దేశ అభ్యున్నతికి మార్గం
మాక్లూర్: హిందూ సమాజాన్ని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నారు. రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ధి ఉత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని అడవి మామిడిపల్లి శివారులోని వంజరి సంఘ కల్యాణ మండపంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్ష, కా ర్యదర్శులు చౌడ లక్ష్మణ్, బాశెట్టి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తల్లితండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే హిందూ మార్గం గురించి చెప్పాలన్నారు. సమ్మేళనంలో వక్తలు శుభ దేశ్‌పాండే, మధన్‌గుప్తా, నర్రవెంకట శివకుమార్, సర్పంచ్ కూన లత, స్థానిక హిందూ ధర్మ రక్షకులు గంగోనే సంతోష్, చింత ప్రవీణ్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.


