సుభాష్‌నగర్: ఆటిజం అనేది మానసిక వ్యాధి కాదని, సరైన చికిత్సతో దూరం చేయవచ్చని ఇండియన్ పీడియ్రాటిక్ అసోసియేషన్ వైద్యులు సత్యకుమార్ స్వామి, శ్రీకాంత్, దీపక్ రాథోడ్, మానసిక వైద్య నిపుణులు ఇన్నమూరి రవితేజ, రాజేందర్ సూరినీడు అన్నారు. జిల్లాకేంద్రంలోని మారుతీనగర్‌లోగల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్‌స్ట్రక్షన్, ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ప్రతి 50 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం బారిన పడుతు న్నారన్నారు. 15 నుంచి 18 నెలల చిన్నారుల్లో నడవడికను గుర్తించి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే వ్యాధిని అధిగమించవచ్చన్నారు. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో మాత్రమే ఆటిజం వ్యాధికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్నారని, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కూడా ఈ పత్రాన్ని ఇచ్చేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జన్యుపరంగా, మన చుట్టూ నివాసముండే పరిసరాలను బట్టి కూడా ఆటిజం వ్యాధి వస్తుందని తెలిపారు. తోటి పిల్లలతో కలిసి ఉండకపోవడం, ఒంటరిగా, మౌనంగా ఉండటం ఆటిజం లక్షణాలన్నారు. స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యో తి, సిద్ధయ్య మాట్లాడుతూ.. ఆటిజం, మానసిక దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక ప ద్ధతిలో విద్య నేర్పిస్తున్నామని తెలిపారు. అనంతరం వైద్యులను ఘనంగా స న్మానించారు. మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కార్యవర్గసభ్యులు రమణరెడ్డి, దాతలు ముప్పాల సత్యనారాయణ, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, మానసిక దివ్యాంగులు, అంద విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మొదటి దశలోనే గుర్తించాలి
సుభాష్‌నగర్: ఆటిజం లక్షణాలను మొదటి దశలోనే గుర్తించి, సరైన వైద్యుడిని సంప్రదిస్తే, థెరపీలు, మందులతో పిల్లల్లో మార్పు తీసుకురావచ్చని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ అన్నారు. ఐఎంఏ, తెలగాణ మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ విశాల్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా చిన్న పిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. ఆటిజం అనేది చిన్న పిల్లల్లో కన్పించే ఒక ప్రత్యేకమైన మానసిక సమస్య అని అన్నారు. ఈ సమస్యకు భూతవైద్యులను సంప్రదించడం సరికాదన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్లు కే శ్రీశైలం, టీ జీవన్‌రావు, వినోద్ కుమార్ గుప్తా, రమణేశ్వర్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కొలువుదీరిన బార్ నూతన కార్యవర్గం
నిజామాబాద్ లీగల్: నూతనంగా ఎన్నికై న నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. నగరంలోని జిల్లా కోర్టులోగల డీఎల్‌ఎస్‌ఏ భవనంలో ఉన్న పీపీ గంగారెడ్డి హాల్‌లో గురువారం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి అమిడాల సుదర్శన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదుల సహకారంతో బార్ అసోసియేషన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. బార్, బెంచ్ సమన్వయంతో అసోసియేషన్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. జిల్లా న్యాయమూర్తి జీవీఎన్. భారతలక్ష్మి మాట్లాడుతూ.. బార్, బెంచ్ ఒకరికొకరు సహకరించుకుంటు ముందుకు వెళ్లాలని సూచించారు. నూతన న్యాయవాదులు ఆధునిక సాంకేతికత సహాయం తీసుకుంటూ తమ సామర్థ్యాలు పెంచుకోవాలని, సీనియర్ న్యాయవాదులు సైతం జూనియర్లకు సహకరించాలని అన్నారు.


