జిల్లా జైలులో రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలులో రక్తదాన శిబిరం

Apr 3 2026 7:44 AM | Updated on Apr 3 2026 7:44 AM

జిల్లా జైలులో రక్తదాన శిబిరం తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లుపై హర్షం ‘పారాక్వాట్‌’ గడ్డి మందుపై నిషేధం ఐస్‌క్రీం బండ్లకు ప్రవేశం లేదు

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని జిల్లా జైలు లో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా 16 మంది అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. వైద్యాధికారి కావ్య మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో రక్తం కొరత తీవ్రంగా ఉందని ఇలాంటి సమయంలో జైలు అధికారులు రక్తదానం చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. జైలు అధికారి అశోక్‌ కుమార్‌, జైలర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ జైలర్‌ మన్మత్‌, కోఆర్డినేటర్‌ స్వరూప, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు–2026’ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందడంపై జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు మాయావర్‌ రాజేశ్వర్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం/రూ.10వేల మొత్తాన్ని కోత విధించి నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, వివిధ ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందన్నారు. తల్లిదండ్రుల పోషణను పట్టించుకోని వారిపై కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించిన తర్వాత 60 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రభుత్వానికి జిల్లా వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం తరపున రాజేశ్వర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలోనూ అధికారులు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాజేశ్వర్‌ కోరారు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): అధిక విషతత్వం కలిగిన ‘పారాక్వాట్‌’ గడ్డి మందుతోపాటు దాని సంబంధిత ఫార్ములేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నం 24ను జారీ చేసిందన్నారు. పారాక్వాట్‌ గడ్డి మందును డీలర్లు దుకాణాల్లో అమ్మకూడదని, స్టాకు ఉంచినా కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇటు రైతులు సురక్షిత, ప్రత్యామ్నాయ కలుపు నివారణ పద్దతులను అనుసరించాలని సూచించారు.

మాందాపూర్‌ గ్రామ సభలో

పాలకవర్గం తీర్మానం

మాక్లూర్‌: తమ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లకు ప్రవేశం లేదంటూ గురువారం మాందాపూర్‌ సర్పంచ్‌ అల్లరి మహేష్‌ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి తీర్మానం చేశారు. ఈసందర్భంగా గ్రామానికి ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలు, ఐస్‌క్రీం బండ్లతో వచ్చి గ్రామాల్లో నాసిరకం ఐస్‌క్రీంలు అమ్మటం వల్ల పిల్లలకు దగ్గు, జ్వరం వచ్చి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్‌ తెలిపారు. గ్రామంలో ఎవరైన ఐస్‌క్రీంలు విక్రయిస్తే రూ.5000 జరిమానా విధిస్తామన్నారు. అనంతరం కొనసాగిన గ్రామ సభలో నాసిరకం ఐస్‌క్రీంలతో కలిగే దుష్ప్రాభావాలపై అవగాహన కల్పించారు. ఉపసర్పంచ్‌ నగేష్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement