ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో పన్ను వసూలు కాకపోవడంతో వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వినూత్న ఆలోచన చేశారు. తాజా బకాయిలతోపాటు మొండి బకాయిలు చెల్లించిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి పన్ను చెల్లించే వారి పేర్లతో జూన్ 26న లక్కీ డ్రా తీయనున్నారు. మొదటి బహుమతిగా గ్రాము బంగారం, రెండో బహుమతిగా స్మార్ట్‌ఫోన్, మూడో బహుమతిగా ఫ్రిడ్జ్, నాలుగో బహుమతిగా మిక్సీ గ్రైండర్, ఐదో బహుమతిగా పట్టుచీర అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్రోచర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వందశాతం పన్ను వసూలైతేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో లక్కీ డ్రా తీస్తున్నామని సర్పంచ్ బేల్దారి నవీన్ తెలిపారు. – వేల్పూర్
● దేశాంతర ప్రేమ వివాహం
నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగి తండాాకు చెందిన బొంత వెంకటేశ్, శ్రీలంకకు చెందిన ఉమేక తారుషి ల వివాహం లింగి తండాలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తండా పెద్దలతో పాటు శ్రీలంకకు చెందిన అమ్మాయి బంధువులు హాజరయ్యారు. ఎల్లలు దాటిన వీరి ప్రేమ వివాహానికి మండల ప్రజలు సైతం హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా వరుడు వెంకటేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్‌లోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నామని, అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకున్న వివాహం తనకు ఎంతో సంతోషానిచ్చిందని అన్నారు. పెళ్లికి పెద్ద సంఖ్యలో తండాావాసులు పాల్గొన్నారు.


