నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఇక్కడ అమలు చేయకపోగా కేరళలో మళ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ ప్రచారం చేస్తున్నారని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2500, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింది తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాల కల్పన, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీని పట్టణ ప్రాంతంలో, ఎస్సీ, ఎస్టీలకు దళిత బంధు కింద పది లక్షలు ఇలాంటి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆదర్శంగా పనిచేస్తుందని, దళితులకు, అణగారిన వర్గాల వారిని పూజారులుగా నియమించిన ఏకై క రాష్ట్రం కేరళ అని గుర్తు చేశారు. దళితులు క్రిస్టియన్‌లోకి మారినా వారిపై వివక్ష పోవడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. దేశంలో మతం మారడం సాధ్యమవుతుంది కానీ కులం మారడం మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో పసుపు తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, వాటికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకట్, బుర్రి ప్రసాద్, ఆశన్న రమేష్‌బాబు, పెద్ద వెంకట రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, గంగాధర్, సుజాత, శిల్ప లింగం, రాజు, అంజయ్య, అనిత, శ్రీదేవి, ఓడ్డెన్న, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


