● కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో ఘటన
● రెండు నెలలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
కామారెడ్డి క్రైం: రెండు నెలల కిత్రం సెల్‌ఫోన్, నగదు కాజేసే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి హత్య చేసి, పరారైన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్‌లోని ఎంక్వయిరీ కౌంటర్ వద్ద ఫిబ్రవరి 12న రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మధ్య ఫోన్ విషయంలో వాగ్వాదం మొదలైంది. ఓ వ్యక్తి సెల్‌ఫోన్, నగదు కాజేసే ఉద్దేశంతో మరో వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. బాధితుడికి ముఖం, ఛాతీపై తీవ్రమైన గాయాలు కావడంతో కిందపడిపోయి మృతి చెందాడు. వెంటనే మృతుడి వద్దనున్న సెల్‌ఫోన్, రూ.300 నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడి ఆనవాళ్లు కనిపించాయి. కానీ హత్యకు గురైన, హత్యకు పాల్పడిన ఇద్దరి వివరాలు లభించలేదు. కొద్దిరోజులకు మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడు కొంత కాలంగా కామారెడ్డిలో కూలీపనులు చేసకుంటూ జీవించేవాడని తేలింది. కామారెడ్డి రైల్వే స్టేషన్ ప్రాంతంలో శనివారం నిందితుడి కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని మహారాష్ట్రలోని అర్నితలోక్ యవత్మాల్ జిల్లా పంగిడి గ్రామానికి చెందిన ఆకాష్ నాగూరావ్ కోవెగా గుర్తించామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఏఎస్సై రంగారావు, కానిస్టేబుళ్లు కమలాకర్, రాజు, సంపత్‌లను, నిందితుడి సమాచారం ఇచ్చిన షేక్ సద్దాం అనే వ్యక్తిని అభినందించారు.
కామారెడ్డి క్రైం: నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో శనివారం ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గోలి సుదీప్ కుమార్ రామారెడ్డి రోడ్డులోని చర్చి సమీపం నుంచి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి అతడిని అడ్డగించాడు. కత్తితో బెదిరించి రూ.2వేలు లాక్కున్నాడు. అంతేకాకుండా ఫోన్‌పే ద్వారా మరో రూ. 8వేలు అతడి ఖాతాకు బదలాయించుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నిందితుడిని అదే కాలనీకి చెందిన శివరాత్రి నవీన్‌గా గుర్తించారు. శనివారం అతడిని గంజ్ గేటు వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే అతడి వద్ద నుంచి ఓ బైక్, కత్తి, మొబైల్ ఫోన్, రూ.8వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
మాక్లూర్: పెళ్లి అయిన నెలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన అఖిల (25)కు ఆలూర్ మండలం కల్లేడ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో మార్చి 5న వివా హం జరిగింది. శనివారం ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. పూర్తివివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులోగల పేకాట స్థావరంపై శనివారం సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులు దాడిచేశారు. పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు వా హనాలు, మూడు సెల్‌ఫోన్లు, రూ. 10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేష్ తెలిపారు.


