భిక్కనూరు: పింఛన్ కోసం ఓ దివ్యాంగుడు చెట్టెక్కి దూకుతానంటూ హంగామా చేశాడు. వివరాలిలా ఉన్నాయి. కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల రాములు దివ్యాంగుడు. గతంలో అతడికి వికలాంగుల పెన్షన్ వచ్చేది. మూడేళ్లుగా అందడం లేదు. గురువారం గ్రామ సభ వద్దకు వచ్చి తన సమస్యను వివరించాడు. మూడేళ్ల క్రితం ఆన్‌లైన్ అయినప్పటినుంచి పింఛన్ రావడం లేదని తెలిపాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు చెప్పినా వినిపించుకోకుండా సమీపంలోని చెట్టు ఎక్కాడు. పింఛన్ మంజూరు చేయకపోతే దూకుతానని బెదిరించాడు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ అరుణ స్వామి, వార్డు సభ్యులు రాములుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఓ వార్డు సభ్యుడు చెట్టెక్కి రాములుతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు చెప్పడంతో రాములు చెట్టు దిగాడు.


