నిజామాబాద్ అర్బన్: పేద ఆడబిడ్డ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థికసాయాన్ని పెంచాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం పలువురు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, సుమారు 326 మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 24 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ధన్‌పాల్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పథకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం పెంచాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద ఒక తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ ఉమారాణి కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


