పరమేశ్వరా..పాహిమాం
అరుదైన అనుభూతి
నేడు మహాశివరాత్రి
● ముస్తాబైన శైవక్షేత్రాలు
● లింగోద్భవ పూజలకు ఏర్పాట్లు
జిల్లాలోని శైవక్షేత్రాలు మహా శివరాత్రిని పురస్కరించుకొని శివనామస్మరణతో మార్మోగనున్నాయి. తేజోరూపుడు, పరమేశ్వరుడు కొలువైన ముక్కంటి సన్నిధికి భక్తులు తరలిరానున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. శివుడికి బిల్వ పత్రాల సమర్పణ, ఉపవాసం, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని పలు ప్రసిద్ధి శైవక్షేత్రాలపై ప్రత్యేక కథనం...
నిత్య పూజల నీలకంఠుడు
సిరికొండ: జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం సిరికొండ లొంక. మండల కేంద్రానికి 7 కిమీ.ల దూరంలోని దట్టమైన అడవుల్లో ఎత్తయిన గుట్టల మధ్య ఉన్న లొంక (లంక)లో కొలువైన నీలకంఠ రామలింగేశ్వరస్వామి భక్తుల నిత్య పూజలందుకుంటున్నారు. త్రేతాయుగంలో వనవాసం సమయంలో సీతమ్మ వెదుకుతూ వచ్చిన రాములు లొంకలో విడిది చేసి, స్వయంగా సైకత లింగాన్ని తయారు చేసి పూజలు చేశాడని ప్రతీతి. మహా శివరాత్రికి ఈ ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర జరుగుతుంది. అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడి కోనేటిలో స్నానం చేసి లింగేశ్వరున్ని పూజిస్తే రుగ్మతలన్నీ మాయమవుతాయని భక్తుల విశ్వాసం.
ఆధ్యాత్మిక కేంద్రం..నవనాథ సిద్దుల గుట్ట
ఆర్మూర్: ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా విధంగా ఒకదానితో ఒకటి పేర్చినట్లుగా నల్లని రాళ్లతో విస్తరించి ఉండి చారిత్రాత్మకమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుంటోంది ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్ట. నవనాథులు పూజించిన సిద్దేశ్వరుని లింగాన్ని రాళ్ల గుహలో నుంచి వెళ్లి దర్శించుకోవడం ఓ చక్కని అనుభూతి. ఇక్కడి కోనేరులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నీళ్లుంటాయి. గుహల మధ్య సహజ సిద్దంగా ఏర్పడిన పాల గుండం, నీటి గుండం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నవనాథ సిద్దుల గుట్టపై ఉన్న శివాలయంలో ప్రతి శివరాత్రిని భక్తులు వైభవంగా జరుపుకుంటారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
శివరాత్రి పర్వదినాన సిద్దులగుట్ట పర్యటన ప్రతి ఒక్కరికీ అరుదైన అనుభూతిగా మిగులుతుంది. ప్రకృతి, దైవత్వం కలగలిపిన ప్రాంతం కావడంతో ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది.శివున్ని దర్శనం చేసుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
– భారత్ గ్యాస్ సుమన్,
సిద్దుల గుట్ట ఉత్సవ కమిటీ ప్రతినిధి, ఆర్మూర్
పరమేశ్వరా..పాహిమాం


