ఉప్లూర్‌లో బాలరాజేశ్వరుడు..
కమ్మర్‌పల్లి:వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం తర్వా త రెండో పుణ్యక్షేత్రంగా కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లోని శ్రీ బాలరాజేశ్వరస్వామి దేవాలయం ప్రసిద్ధికెక్కింది. స్వయంభూ శివలింగం ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలంలో 12 శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మహా శివరాత్రి రోజున నిర్వహించే ఉత్సవాలకు మహారాష్ట్ర, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. కోడె మొక్కులు, నిలువెత్తు బంగారం (బెల్లం) స్వామి వారికి సమర్పించుకుంటారు. చిన్న పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయడం, పెద్దలు తలనీలాలు సమర్పించుకుంటారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రికి దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం నిశిపూజ, పంచామృత మహా రుద్రాభిషేకం, స్వామి వారి పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు బాలరాజేశ్వరుడు దర్శనమిస్తాడు.


