పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొ న్నారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లి ప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సా మగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ కాస్టింగ్ ఏర్పా ట్లు, పోలీసు బందోబస్తు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతోపాటు బోధన్ మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువులోపు పోలింగ్ కేంద్రంలోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా టోకెన్లు జారీ చేసి, ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి భీంగల్, ఆర్మూర్ పట్టణాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు.


