నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీల తీర్మానాలు
తోపుడు బండిపై ఐస్‌క్రీం విక్రయిస్తే రూ.5 వేలు జరిమానా
రసాయనాల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యానికి ముప్పు అంటూ చర్యలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్‌క్రీం అమ్మితే నేరమే అని పంచాయతీ పాలకవర్గాలు అంటున్నాయి. ఈ మేరకు వరుస తీర్మానాలు కూడా చేస్తున్నాయి. తమ ఆదేశాలను కాదని ఐస్‌క్రీంలు విక్రయిస్తే బండ్ల నిర్వాహకుల వద్ద రూ.5 వేలు జరిమానా వసూలు చేస్తామని పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా తమ పిల్లల ఆరోగ్యం కోసమేనని పంచాయతీ పాలకవర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లోకి ఐస్‌క్రీం బండ్లకు అనుమతి లేదంటూ గ్రామ పంచాయతీలు వరుసగా తీర్మానాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
⇒ తాజాగా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, మాక్లూర్ మండలం మందాపూర్, డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, అన్నారం, నూత్‌పల్లి, తొండాకూర్ గ్రామాలు కూడా అదే బాటలో నడిచాయి. ఐస్‌క్రీం తినడం వల్ల పిల్లలకు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు, వాటిలో కలిపే రంగులు, రసాయనాల వల్ల భవిష్యత్‌లో కేన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామ సభలు నిర్వహించి మరీ తమ గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు నిషేధిస్తూ.. తీర్మానాలు చేస్తున్నారు.
⇒ నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్, అయిలాపుర్, చింరాజ్‌పల్లి, వెల్మల్, తొండాకూర్, గాదేపల్లి ఆర్మూర్ మండలంలో పిప్రి, ఆర్మూర్, ముప్కాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో తోపుడు బండ్లపై ఐస్‌క్రీం అమ్మకాలను నిషేధిస్తూ జీపీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 వరకు జరిమానా విధిస్తామని పంచాయతీ పాలకవర్గాలు గ్రామ ముఖద్వారం వద్ద, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బోర్డులు (ఫ్లెక్సీలు) ఏర్పాటు చేశాయి.
ఏప్రిల్ 2 నుంచి నిషేధం..
గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఏప్రిల్ 2వతేదీ నుంచి సుద్దపల్లిలో ఐస్‌క్రీం తోపుడు బండ్లను నిషేధించాం. గ్రామసభ లో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామ ముఖద్వారంతో పాటు అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. ఈ తీర్మానాన్ని కాదని ఎవరైనా ఐస్‌క్రీం విక్రయిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తాం. – పానుగంటి రూప, సర్పంచ్ సుద్దపల్లి
పిల్లల ఆరోగ్యం కోసమే..
తోపుడు బండ్లపై అమ్మే ఐస్‌క్రీంలు తినడం వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఐస్‌క్రీంలో కలిపే రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని గమనించి గ్రామసభలో ఐస్‌క్రీం తోపుడు బండ్లు గ్రామంలోకి రావద్దని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. దీనికి వీడీసీతో పాటు గ్రామ యువత, గ్రామస్తులు సంపూర్ణ మద్దతు తెలిపారు. – వినోద్‌రెడ్డి.. సుద్దపల్లి గ్రామస్తుడు
మనం చాక్లెట్ అంటే పడి చావడం లేదు!!
చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఎంత ఇష్టమన్నదే ఇక్కడ పాయింట్. యూరప్, యూఎస్‌లో చాక్లెట్ అంటే పడి చస్తుంటే.. ఆసియాలో మాత్రం చాక్లెట్ కన్నా.. స్థానిక మిఠాయిలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రపంచంలో జర్మనీ వాసులు అత్యధికంగా చాక్లెట్‌ను తింటున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అక్కడ ఒక్కో వ్యక్తి ఏడాదికి 8.1 కిలోల చాక్లెట్‌ను తింటున్నాడట. తర్వాతి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. చివరి స్థానాల్లో భారత్, చైనాలు ఉన్నాయి. ఓసారి ఆ లెక్కలేంటో చూసేద్దామా..


