క్రమంగా కిందకు..
● జనవరిలో 2.36 మీటర్లు తగ్గిన
భూగర్భ జలాలు
● జిల్లాలో ప్రస్తుత నీటి మట్టం
9.56 మీటర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): వేసవి ప్రారంభానికి ముందే జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఏకంగా 4.16 మీటర్ల లోతులోకి వెళ్లాయి. జనవరిలోనే 2.36 మీటర్లు తగ్గిపోవడం నీటి వినియోగ తీవ్రతను తెలుపుతోంది. వ్యవసాయ బోర్ల వాడకం పెరగడం కారణంగా డిసెంబర్‌లో 7.20 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలు జనవరి ముగిసే నాటికి 9.56 మీటర్ల లోతులోకి చేరాయి. ఇది 2025 జనవరి నెలతో (10.09 మీటర్లు) పోలిస్తే కొంచెం మెరుగైన పరిస్థితి అని చెప్పొచ్చు. జిల్లాలో 82 పరిశీలక బోరు బావులు (ఫీజో మీటర్లు) ద్వారా జనవరి మాసానికి సంబంధించిన నీటి లెక్కలను ఇటీవల గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తీశారు. ఇందులో 49 ఫీజో మీటర్లలో 10 మీటర్ల లోపు నీటి మట్టాలున్నాయి. అలాగే 30 ఫీజో మీటర్లలో 10 నుంచి 20 మీటర్ల లోపు భూగర్భ జలాలున్నాయి. అదే విధంగా మూడు ఫీజో మీటర్లలో 20 మీటర్ల లోతులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 74 శాతం భూరగ్భజలాలు విస్తరించి ఉండగా భీమ్‌గల్, సిరికొండ, డిచ్‌పల్లి, మోపాల్, నవీపేట్ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు తగ్గుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
నీటిని పొదుపుగా
వాడుకోవాలి
రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని ప్రపంచ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా ప్రజలు, రైతులు భూగర్భ జలాలు తగు మోతాదులో వాడుకోవాలి. వేసవిలో ఎద్దడి రాకుండా ఉండాలంటే నీటిని వృథా చేయొద్దు. వృథా నీరు భూమిలోకి చేరేలా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. – శ్రీనివాస్‌బాబు,
జిల్లా భూగర్భ జల శాఖ అధికారి
క్రమంగా కిందకు..


