విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి
ఖలీల్‌వాడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే లక్ష్మీనారాయణ ఆన్నారు. శనివారం ఖలీల్‌వాడిలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సర్వసభ్య సమావేశం టీపీటీఎఫ్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వీ సురేశ్, ఎం బాలయ్య అధ్యక్షతన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సామాజిక వ్యవస్థలోని అసమానతలను రూపుమాపడానికి విద్యానే ముఖ్యమని, దీనిని దేశంలోని అందరికీ కామన్ స్కూల్ విధానం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. విద్యారంగంలో పర్యవేక్షణ కొరవడిందని 33 జిల్లాలకు 26 జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు లేరని, 612 మండలాలకు 596 మండలాలకు మండల విద్యాధికారులు లేరని చెప్పారు. పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికా దని అన్నారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యపరిచే జీవో 25 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు అనిల్ కుమార్, వేణుగోపాల్, పీ శంతన్, కే ఒమాజీ, రాసరి పెంటన్న, పీ దాసు, ఓ శ్రీనివాస్, బాలరాజు, చంద్రశేఖర్, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.


