ముగిసిన నామినేషన్ల పర్వం
సుభాష్‌నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం ఒక్క రోజే 750 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు భారీ మొత్తంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1005 నామపత్రాలు స మర్పించారు. సాయంత్రం 5 గంటలకే గడువు ముగియడంతో ఆలోపు నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి వచ్చిన వారికి టోకెన్లు జారీ చేసి నామినేషన్లు స్వీకరించారు. నగరంలో ఏ ర్పాటు చేసిన 20 నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొన్నారు. కాగా, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
అట్టహాసంగా
నామినేషన్ల ర్యాలీలు..
నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలుచేశారు. బైక్ ర్యాలీలు, డప్పువాయిద్యాలు, బ్యాండ్ మేళా, డీజేలు, కార్ల వాహన ర్యాలీగా తరలివచ్చారు. కొందరు అభ్యర్థులైతే ప్రజలు, బంధుగణాన్ని తీసుకొచ్చి తమ బలబలాలను పరీక్షించుకున్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఉండటంతో 100 మీటర్ల దూరంలోనే ర్యాలీలను నిలిపేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కేంద్రంలోనికి కేవ లం ముగ్గురు, నలుగురిని మాత్రమే అనుమతించారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి 6వ డివిజన్ బీజే పీ అభ్యర్థి గోపిడి స్రవంతిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి టికెట్లు దాదాపు ఖరారైన వారి నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా శనివారం ఉద యం 11 గంటల నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పరిశీలనకు హాజరుకావాలని రిట ర్నింగ్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నామినేషన్లు చెల్లుబాటు అయిన అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు.
చివరి రోజు భారీ సంఖ్యలో..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మొదటిరోజు కేవలం 13 మంది దాఖలు చేయగా, రెండోరోజు 242 దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 750 దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ అధికంగా ఉంది. ఒక్కో డివిజన్‌లో ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు రెండు, మూడు పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియడంతో అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న వారి నామినేషన్లను స్వీకరించారు.
చివరిరోజు 750
మొత్తం 1005 దాఖలు
పోటాపోటీగా నామపత్రాలు
సమర్పించిన అభ్యర్థులు
టోకెన్లు జారీ చేసి రాత్రి వరకూ
స్వీకరించిన అధికారులు
నేడు నామినేషన్ల స్క్రూటినీ


