విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● సొంత బిడ్డల్లా చూసుకోవాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల భద్రత, సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్ల ప్రాంతీయ సమన్వయకర్తలు (ఆర్‌సీవో)లు, నిర్వాహకులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను ఉటంకిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకోకుండా పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రత్యేకించి బాలికల వసతి గృహాలు, గురుకులాల నిర్వహణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికల హాస్టళ్లలో ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా కట్టడి చేయాలని, తల్లిదండ్రులు వస్తేనే వారి వెంట ఇంటికి పంపాలన్నారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, శుభ్రమైన నీటి సరఫరా, ఆహార పరిశుభ్రత, పౌష్టికాహారం అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లను అనునిత్యం పర్యవేక్షించాలన్నారు. పాముకాటు వంటి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం శుభ్రమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. ఫుడ్ పాయిజన్ సమస్యను నివారించడానికి శానిటేషన్, వంటగదిలో పనిచేసే సిబ్బందికి తగిన సూచనలు చేయాలన్నారు. నిల్వ ఉంచిన నాన్‌వెజ్‌ను పెట్టొద్దన్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, తమ సొంత బిడ్డలుగా వారి సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈవో అశోక్, ఆర్‌సీవోలు, హాస్టళ్ల నిర్వాహకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


