ఇక్కడ పనిచేస్తే ‘రేంజ్’ మారిపోద్ది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సిరికొండ ఫారెస్ట్ రేంజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. అటవీ భూములను అడ్డం పెట్టుకొని ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి అమ్మలాంటి అడవిని అమ్మకానికి పెడుతున్నారంటూ పర్యావరణ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు అక్రమార్జన విషయంలో పోటీ పడి భారీగా దండుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సిరికొండ రేంజ్ అంటేనే అటవీ శాఖలో ఖరీదైన ఏరియాగా పేరుపడింది. ఈ అటవీ క్షేత్రం పరిధిలో పని చేసినవారి ‘రేంజ్’ అమాంతం మారిపోతుందనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తోంది. జిల్లాలో అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సిరికొండ రేంజ్ ఒకటి. ఇక్కడ సుమారు 45 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం ఉంది. పరుపు నేలలు ఉండడంతోపాటు టేకు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం నాలుగు సెక్షన్లు, 20 బీట్లు ఉన్నాయి. అయితే బీట్ ఆఫీసర్ పోస్టులు సగం ఖాళీగా ఉన్నాయి. కీలకమైన రేంజ్ అధికారి పోస్టు ఏడాది కాలానికి పైగా ఖాళీ ఉండడంతో కమ్మర్‌పల్లి ఎఫ్‌ఆర్వో రవీందర్ ఇన్‌చార్జి రేంజర్‌గా పనిచేశారు. వారం రోజుల క్రితం కొత్తగా నర్సింగ్‌రావు అనే మరో రేంజ్ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. ఈ కొత్త రేంజ్ అధికారికి ఇక్కడ విధులు నిర్వహించడం పెద్ద సవాలుగానే పరిగణించాలి.
పెరుగుతున్న పోడు వ్యవసాయం
సిరికొండ రేంజ్‌లో బీట్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఎక్కువగా ఉండడంతో అడవుల పర్యవేక్షణ సమస్యగా మారింది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఉందని అటవీ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు స్థానికులతో కుమ్మకై ్క అందినకాడికి దండుకొని అడవుల ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నట్లు అటవీశాఖ వర్గాల్లో కోడైకూస్తోంది. దీంతో పోడు వ్యవసాయం పెరుగుతోంది. కిందిస్థాయి అటవీ అధికారులే దగ్గరుండి మరీ బోర్లు వేయించి సాగు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బైండోవర్లు చేయించి స్టేషన్ బెయిల్ ఇప్పించే విషయంలోనూ అటవీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టింబర్ డిపోల నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరికొండ రేంజ్‌లో వందల ఎకరాల్లో అటవీ భూమి కబ్జాకు గురికాగా, ఇటీవల పందిమడుగు సెక్షన్ ఆఫీసర్‌గా ఉన్న సాయికిరణ్ ఒక్కడినే సస్పెండ్ చేశారనే చర్చ జరుగుతోంది. అడవుల అన్యాక్రాంతం విషయంలో మరికొందరి పాత్ర కూడా ఉందని అటవీ శాఖలో చర్చ జరుగుతోంది. వాళ్లెవరనేది బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. దూప్యాతండా వద్ద అటవీ భూమి కబ్జా ఘటనపై ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వోగా ఉన్న రవీందర్‌కు అటవీశాఖ ఉన్నతాధికారులు నోటీసు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిరికొండ రేంజ్‌లో కొందరు అధికారుల తీరుతో తమకు కూడా చెడ్డపేరు వస్తోందని పలువురు బీట్ అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రేంజ్‌లకు బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాసులు కురిపిస్తున్న
సిరికొండ ఫారెస్ట్ రేంజ్
కొందరు స్థానికుల సహకారంతో
అడవుల అమ్మకం
రూ.లక్షలు దండుకుంటున్న
కొంతమంది అటవీ అధికారులు


