టీ–పోల్ యాప్‌లో నమోదు చేయండి
● ఇన్‌చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి
బాన్సువాడ : నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, రోజువారీగా టీ–పోల్ యాప్‌లో నమోదు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. రిజిస్టర్లను పరిశీలించారు. మొదటి రోజు దాఖలైన నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలన్నారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల పరిశీలన కోసం అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. ఆమె వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తదితరులున్నారు.


