స్థానికంలోనూ త్రిముఖమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రాజకీయ ముఖచిత్రం విడతలవారీగా మారుతూ వస్తోంది. గతంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేవిధంగా పోటాపోటీ ఉండేది. అయితే గత ఆరేడు సంవత్సరాల కాలంలో ముఖాముఖి పోటీ బదులు త్రిముఖ పోటీ నెలకొంటోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్–టీడీపీ, కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ల మధ్య పార్లమెంట్, శాసనసభ, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పోరు నడిచింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక మా త్రం ఉమ్మడి ఇందూరు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎ స్ పార్టీలతో బీజేపీ ఢీకొడుతూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీ గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో (2019, 2024) వరుసగా విజయకేతనం ఎగురవేసింది. అ యితే శాసనసభ, స్థానిక ఎన్నికల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూ పుతూ వచ్చింది. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేనవిధంగా బీజేపీ ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. పలు నియోజకవర్గాల్లోనూ పార్టీ గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్ నగరపాలక సంస్థలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనవిధంగా ప్రస్తుతం పంచాయతీ పోరులో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అధికార కాంగ్రెస్ తరువా త బీఆర్‌ఎస్‌కు సమానంగా జిల్లాలో బీజేపీ పంచా యతీల్లో పోటీ చేస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కీలక పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు నడుస్తున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ పోరులోనే త్రిముఖ పోరు ఉంటే రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదని రాజకీయ, ఇతర వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పార్లమెంట్, అసెంబ్లీ మాదిరిగా
పోటాపోటీ
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థుల హోరాహోరీ
రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనే చర్చ


