ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటిచెప్పాలి
నిజామాబాద్ అర్బన్: ప్రతి ఓటరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రాధాన్యతను చాటిచెప్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఉన్న 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఓటరు సమాచార స్లిప్పులను బీఎల్‌వోల నేతత్వంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలింగ్‌కు ముందు పంపిణీ చేస్తారని చెప్పారు. సమస్యా త్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత, ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని, వెబ్ క్యాస్టింగ్‌కు అవకాశం లేని పోలింగ్ సెంటర్లలో మైక్రో అబ్జర్వర్లను నియమిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకునేందుకు, ఫిర్యాదు చేసేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు జిల్లాకు చేరుకున్నారని, వారు ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. మొదటి విడతలో బోధన్ డివిజన్‌లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని నవీపేట మండలం పరిధిలోని 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని, గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని, ఏకగ్రీవాల కోసం బలవంతపు విధానాలను అవలంబించొద్దని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకారించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మండలాల వారీగా దాఖలైన నామినేషన్‌లు
ప్రతి ఓటరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు
మీడియాతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి


