ఆయిల్ పామా.. ఆలోచిద్దాం!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కొత్త రైతులు ముందుకు రావడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. చూద్దాం.. ఆలోచిద్దామనే సమాధానాలు రైతుల నుంచి వస్తున్నాయి. వరి వంటి పంటలకు మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇవ్వడంతో వాటినే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నాలుగేళ్లకు చేతికొచ్చే ఆయిల్ పామ్ పంటను వద్దనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. తద్వారా జిల్లాలో గత మూడేళ్లలో సాగు చేసిన ఆయిల్ పామ్ పంట తప్పితే ఈ ఏడాది కొత్తగా ముందుకొచ్చి సాగు చేసిన పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదు. జిల్లాలో ఈ సంవత్సరం 3వేల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను రైతులతో సాగు చేయించాలని లక్ష్యంగా ఉంది. 2026 మార్చి ముగిసే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 450 ఎకరాల్లో మాత్రమే సాగు చేయించారు. అది కూడా అతి కష్టం మీద. ఇంకా 2550 ఎకరాలు వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేయడం కష్టమనే చెప్పొచ్చు. ప్రతి ఏడాది లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో మిగిలిన లక్ష్యాన్ని ఉద్యాన శాఖ అధికారులు మరో ఏడాదికి జోడిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని చోట్ల పంట కోతలు రావడంతో అధికారులు దానిపైనే దృష్టి పెట్టారు. కొత్త రైతులను గుర్తించి వారితో సాగు చేయించడానికి పెద్దగా శ్రద్ధ చూపడం లేదని విమర్శలున్నాయి. అందుకే ఈ ఏడాది లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేకపోయారు.
నాలుగేళ్లలో 6,500 ఎకరాలు సాగు
నాలుగేళ్ల కాలంలో ఆయిల్ పామ్‌ను జిల్లాలో 6,500 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో 450 ఎకరాలు ఈ ఏడాదికి సంబంధించినవే. మూడేళ్ల క్రితం సాగైన ఆయిల్ పామ్ పంట జిల్లాలో ఆర్మూర్, బోధన్ డివిజన్‌లో కోతకు వచ్చింది. పలువురు రైతులు 500 మెట్రిక్ టన్నుల పంటను విక్రయించి టన్నుకు రూ.21వేల వరకు లాభాలు సైతం పొందారు. ప్రస్తుతం టన్నుకు రూ.19వేలు వస్తోంది. ప్రభుత్వం ఆయిల్ పామ్‌ను సాగు చేస్తే మొక్కలు సబ్కిడీపై ఇస్తుండగా మెయింటనెన్స్ నిధులు కూడా ఇస్తోంది. అలాగే డ్రిప్ సిస్టం పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరుశాతం సబ్సిడీ ఇస్తోంది. జీఎస్టీ మాత్రమే భరించాల్సి ఉంటుంది. అలాగే బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం పెద్ద రైతులకు 80 శాతం సబ్పిడీ అందజేస్తోంది.
రైతులు ముందుకు రావాలి
ఆయిల్ పామ్ పంట చేతికి వచ్చేందుకు ఆలస్యమైనా అధిక లాభాలు వస్తాయి. ప్రభుత్వం మూడు రకాలుగా సబ్సిడీ అందజేస్తోంది. కొత్త రైతులు ఆలోచించి సాగుకు ముందుకు రావాలి. ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయాధికారుల సహకారాన్ని తీసుకుంటాం. – శ్రీనివాస్‌రావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి
సాగు చేసేందుకు ముందుకురాని
కొత్త రైతులు
ఈ ఏడాది సాగు లక్ష్యం 3వేల ఎకరాలు
ఇప్పటి వరకు సాగైంది
450 ఎకరాల్లో మాత్రమే..
బోనస్, మద్దతు ధర ఇస్తున్న
పంటలపైనే ఆసక్తి
ఆయిల్ పామా.. ఆలోచిద్దాం!


