పారదర్శకంగా కేసులను విచారించాలి
● సీపీ సాయి చైతన్య
నిజామాబాద్‌అర్బన్: కేసుల విచారణ పూర్తి పారదర్శకంగా చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసులలో త్వరగా విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి సీసీటీఎన్‌ఎస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతోపాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షిస్తూ కేసుల సంఖ్య తగ్గించేలా అధికారులు పనిచేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డుల ను ఏర్పాటు చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్‌లపై దృష్టిసారించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, జూదం, రేషన్ బియ్యం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కోసం నివేదిక పంపాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సతీశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ సాయి చైతన్య, పాల్గొన్న పోలీసులు
పారదర్శకంగా కేసులను విచారించాలి


