సోయా కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● వెంటనే ప్రారంభించాలని
మార్క్‌ఫెడ్ సూచన
● జిల్లాలో 10 కొనుగోలు
కేంద్రాల ఏర్పాటు
బోధన్: ఈ ఏడాది వానకాలం సీజన్‌లో జిల్లాలో రైతులు పండించిన సోయా కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులు మంగళవారం సమాచారం అందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సేకరణ చేపట్టాలని సూచించింది. బోధన్ మండలంలోని కల్దుర్కి, సాలూర, హున్సా, మావందికుర్ధు, కోటగి రి మండలం పోతంగల్, రెంజల్ మండలం నీలా, వర్ని మండలం జాకోరా(పైడిమల్), ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, కమ్మర్ పల్లి, డొంకేశ్వర్ పీఏ సీఎస్‌లలో కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్ అనుమతి ఇచ్చింది. జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సోయా క్వింటాలుకు మద్దతు ధర రూ.5,328 ప్రభుత్వం చెల్లిస్తుంది.
జిల్లాలో 30వేల ఎకరాల్లో సోయా..
జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా సోయా పండించారు. ఎకరానికి గరిష్ట దిగుబడి 10 నుంచి 12 క్వింటాళ్ల మేరకు ఉంటుంది. అధిక వర్షాలు, వరదలతో దిగుబడి పడిపోయింది. ఎకరానికి 7 క్వింటాళ్ల చొప్పున దిగుబడితో లెక్కిస్తే 2 లక్షల 10 క్వింటాళ్ల మేరకు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాఫెడ్ నుంచి 25 శాతం మేరకు సేకరణ చేపట్టాలని సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంటుంది. పక్షం రోజులుగా కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఆశ గా ఎదురు చూస్తున్న సందర్భంలో మార్క్‌ఫెడ్ నుంచి అనుమతి లభించడంతో ఊరట లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియల్లోనే సహకార సంఘాలు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఓ వైపు వరి, మరో వైపు సోయా కొనుగోళ్లు ఏకకాలంలో కొనసాగించడం ఏమేరకు సాధ్యమవుతుందోనని నిర్వాహకులు తర్జనభర్జన పడుతున్నారు.


