మోంథా గుబులు!
● తుపాను ప్రభావంతో
జిల్లాలో మారిన వాతావరణం
● కోసిన పంట మొత్తం కల్లాలు, రోడ్లపైనే..
● కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు
డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి ధాన్యం కల్లంలో చేరిన వర్షపునీరు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆంధ్రప్రదేశ్‌ను అల్లాడిస్తున్న ‘మోంథా’ తుపాన్ తెలంగాణలోకి ప్రవేశించడంతో రైతులకు గుబులు పట్టుకుంది. మంగళవారం వాతావరణం మారిపోయి జిల్లా వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చినుకులు కూడా పడటంతో పంట దిగుబడులు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన మక్కలు, వడ్లను కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పేశారు. వారం రోజులుగా ఆరబోసిన ధాన్యం కాంటాకు వచ్చిన సమయంలో వర్షాలు రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ పంట తడిస్తే దానిని ఆరబోయడానికి నాలుగైదు రోజులు శ్రమించాల్సి వస్తుందని అంటున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి 4.34 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. మొక్కజొన్న 52,093, సోయా 33,603 ఎకరాల్లో వేశారు. ప్రస్తుతం మక్క, సోయా పంట కోతలు పూర్తి కాగా దిగుబడులు సగం మేర ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. ఇటీవల ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు తెరవడంతో మిగిలిన పంటను కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉంచారు. ఇప్పుడు సమస్య వచ్చిందల్లా వరికే. వరి కోతలు 70 శాతం వరకు పూర్తయ్యాయి. పంట మొత్తాన్ని కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉంచారు. తుపాను కారణంగా వరి గింజలు ఎక్కడ పొలాల్లోనే రాలిపోతాయోననే భయంతో కోతలు త్వరత్వరగా చేసేస్తున్నారు. ధాన్యం కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్లను కొనుగోలు చేస్తున్నారు. మరో రెండు రోజుల వరకు తుపాను ప్రభావం ఉండడంతో రైతులు కల్లాలు, వడ్ల కుప్పల వద్దే కావలి కాస్తున్నారు.
తడిసిన ధాన్యం..
నిజామాబాద్‌అర్బన్: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో అడపాదడపా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవుతోంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్రమైన ఎండ ఉండగా, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం కురిసింది. ప్రధానంగా నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, నిజామాబాద్, డిచ్‌పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, బాల్కొండ ,భీమ్‌గల్, నవీపేట ప్రాంతాలలో కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. మోపాల్‌లో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. నందిపేటలో ఆరబోసిన ధాన్యం తడిసింది.
రైతన్నా.. బీ అలర్ట్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలతో రైతులు నష్ట పోకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి కోయకుండా ఉంచితే స మస్య ఉండదని, హడావుడిగా కోసి ఆరబెడితే మాత్రం మొదటికే మోసం వచ్చి ధాన్యం వర్షార్ప ణమయ్యే పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో రైతులు వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదేవిధంగా రైతులు ధాన్యంలో తేమ శాతం 17 లోపే ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, జిల్లాలోని చాలా చోట్ల నుంచి ధాన్యం తేమ శాతం ఎక్కువగా వస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో తప్పని పరిస్థితుల్లో కాంటాలు పెడుతున్నారు. దీంతో ఆ ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. తేమశాతం ఎక్కువగా ఉంటే నూక శాతం పెరగడంతోపాటు గింజ నల్లగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్‌లో ముందుగానే వరికోతలు పూర్తయినప్పటికీ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం కోతలు నడుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల సమయం తీసుకొని వరికోతలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,15,124 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.
మోంథా గుబులు!


