
పైరవీలు.. ప్రదక్షిణలు..
ఇంకా నిర్ణయం తీసుకోలేదు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు
● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ)లో ఉద్యోగ బదిలీలు జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం సిబ్బంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా పలువురు ఏపీఎంలు తమదైన స్థాయిలో పైరవీలు చేయడంతోపాటు, నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే డీఆర్‌డీవోపై సైతం ఒత్తిడి పెంచుతున్నారు.
జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు..
పదేళ్ల తర్వాత సెర్ప్ సీఈవో పారదర్శకంగా బదిలీలు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కొందరు ఇప్పుడు జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఐతే, బదిలీలు జరిగిన తర్వాత మళ్లీ ఈ డిప్యుటేషన్‌లు ఏంటీ అని శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐకేపీలో ఈ ఏడాది ఆగస్టు నెలలో డీపీఎంల నుంచి మొదలుకొని సీసీల దాకా ఉద్యోగ బదిలీలు జరిగాయి. సెర్ప్ సీఈవోనే సీనియార్టీ ప్రకారం జాబితాను జిల్లాకు పంపించి కలెక్టర్ అధ్యక్షతన స్థాన చలనం కలిగించారు. బదిలీలకు ఆప్షన్లు పెట్టుకుని ఇతర మండలాలకు వెళ్లిన ఏపీఎంలు ఇప్పుడు డిప్యుటేషన్లను ఆశించడం వెనక మతలబు ఏంటో తెలియడం లేదు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో డిప్యుటేషన్‌పై వచ్చి పని చేయడానికి నాలుగురైదుగురు ఏపీఎంలు పోటీ పడుతున్నారు. మండలాల్లో పని చేసే సదరు ఏపీఎంలు జిల్లా స్థాయిలో ఎందుకు పని చేయాలని కోరుకుంటున్నారో అని శాఖలోని ఉద్యోగులు అనుకుంటున్నారు. డిప్యుటేషన్లకు అవకాశం కల్పిస్తే మిగతా ఉద్యోగులు కూడా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని డీఆర్‌డీవోను కోరుతామంటున్నారు. పైరవీలకు తలొగ్గి డిప్యుటేషన్లు వేస్తారా? లేదా ఫైలును తిరస్కరిస్తారా? అనేది డీఆర్‌డీవోపై ఆధారపడి ఉందంటున్నారు.
జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగ బదిలీలు చేసినప్పుడు వీటిని భర్తీ చేయలేదు. డిప్యుటేషన్‌పై జిల్లా ఆఫీసులో పని చేస్తామని కొందరు ఏపీఎంలు దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐతే ఒకరిద్దరు సీసీలకు మాత్రం వారి సమస్యను పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం మ్యూచ్‌వల్ బదిలీ చేయాలనుకుంటున్నాం.
–సాయాగౌడ్, డీఆర్‌డీవో, నిజామాబాద్