
దళారులదే దందా..!
బాల్కొండ : మద్దతు ధర ఇవ్వడంలో భాగంగా ప్రభుత్వం మక్క పంట కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయక పోవడంతో రైతులు త్రీవంగా నష్టపోతున్నారు. దళారులదే దందా సాగుతోంది. మెండోరా మండల కేంద్రంలో ఏకంగా దళారులే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మక్కలను కొనుగోలు చేసి తీసుకొచ్చి కుప్పలు వేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా నేరుగా మెండోరా మండల కేంద్రానికి మక్కలను తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. మక్కలు క్వింటాల్‌కు రూ. 2 వేలకు కొనుగోలు చేస్తున్నారు. మెండోరా మండల పరిధిలో సావెల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఒక్కటే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. అసలు ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడ తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో దళారులు రెచ్చి పోయి ఏకంగా మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్వింటాల్‌కు మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు మక్కలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడంతో రైతులు దళారులకే విక్రయించుకుంటున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం దళారులు కొనుగోలు చేసిన మక్కలను తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరిట విక్రయించే ప్రమాదం కూడ లేక పోలేదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉన్నత అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేల చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సకాలంలో ప్రారంభం కాని
ప్రభుత్వ మక్క కొనుగోలు కేంద్రాలు
మెండోరాలో దళారులే ఏర్పాటు
చేసుకున్న వైనం
మద్దతు ధర కంటే
రూ.400 తక్కువకు కొనుగోలు
తీవ్రంగా నష్ట పోతున్న రైతులు