
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్‌వెల్స్‌లో పనిచేస్తుండేవాడు. ఏడాదికి రెండు మూడు పర్యాయాలు స్వదేశానికి వెళ్లివస్తుండగా, ఈ ఏడాది జనవరిలో భిక్కనూరుకు వచ్చి ఏప్రిల్‌లో తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికాలోని జెలిజా పట్టణం సమీపంలో ఓ చెట్టుకు శ్రీనివాస్ వేలాడుతున్నట్లు ఉన్న ఫొటోలను అక్కడి వారు సోమవారం అతడి కుటుంబీకులకు పంపించారు. ఆదివారం కుటుంబీకులతో సంతోషంగా మాట్లాడిన శ్రీనివాస్ సోమవారం వేకువజామున ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో శ్రీనివాస్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రీనివాస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని శుక్రవారం మృతదేహం ఇండియాకు చేరుకుంటుందని తెలుస్తోంది. మృతుడికి తండ్రి బలరాం, తల్లి లావణ్య భార్య నవనీత, కూతురు లాస్య కుమారుడు నిహాల్ ఉన్నారు.