
డీలర్ల పరేషన్
● కమీషన్ కోసం ఎదురుచూపులు
● ఐదు నెలలుగా పెండింగ్
● జిల్లాలో రూ.3 కోట్లకుపైనే
బకాయిలు
సుభాష్‌నగర్ : ప్రజాపంపిణీ పథకం కింద పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని డీలర్లకు ఐదు నెలలకు సంబంధించి రూ.3 కోట్లకుపైనే బకాయిలు పేరుకుపోయాయి.
జిల్లాలో 759 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 4,47,788 వరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ అవుతోంది. ప్రతినెలా సుమారు 7,650 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేషన్‌షాపుల డీలర్లకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, సభ్యుల చేరికతో గత మూడు నెలల నుంచి అన్ని దుకాణాల్లో బియ్యం కోటా పెరిగింది. మార్చి వరకు సజావుగా కమీషన్ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇటీవల ఏప్రిల్ కమీషన్ జమ చేసింది. మే నుంచి సెప్టెంబర్ వరకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిబంధనల ప్రకారం వేర్వేరుగా కమీషన్ జమ చేస్తుండటంతో డీలర్లు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.
రేషన్‌డీలర్లకు అక్టోబర్ 1లోపు పెండింగ్‌లో ఉన్న కమీషన్ డబ్బులు జమ చేయాలి. కమీషన్ కోసం ఇప్పటికే సంబంధిత మంత్రితో పాటు కమిషనర్‌ను కలిసి విన్నవించాం. అయినా స్పందించడంలేదు. దీపావళి తర్వాత రాష్ట్ర కమిటీతో చర్చించి బియ్యం పంపిణీని నిలిపివేసే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ప్రతినెలా ఒకటో తేదీనే కమీషన్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కమీషన్‌ను పెంచే విధంగా చర్యలు చేపట్టాలి.
– అతిమల నగేష్, జిల్లా అధ్యక్షుడు,
రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
ఆర్థిక ఇబ్బందుల్లో డీలర్లు
ఐదు నెలలుగా కమీషన్ డబ్బులు జమ చేయకపోవడంతో డీలర్లు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. దుకాణాల అద్దె, బియ్యం సరఫరా కు అవసరమైన సిబ్బంది జీతం, ఎంఎల్‌ఎస్ పా యింట్ నుంచి లారీల్లో వచ్చిన బియ్యాన్ని దుకా ణాల్లో దిగుమతి చేసిన హమాలీల చార్జీల చెల్లింపు, తదితర ఆర్థికపరమైన అంశాల్లో డీలర్లు సతమతమవుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం మే నెల కమీషన్ పెండింగ్‌లో ఉంచడంతోపాటు, జూన్, జూలై, ఆగస్ట్ నెలల బియ్యం వర్షాల నేపథ్యంలో ఒకేసారి జూన్ నెలలోనే సరఫరా చేసేసింది. ఆ మూడు నెలలతోపాటు సెప్టెంబర్ కమీషన్ కూడా బకాయి ఉంది. ఐదు నెలల కమీషన్ డబ్బులు జమ కాకపోవడంతో అప్పుల పాలు కావాల్సి వస్తోందని రేషన్‌డీలర్లు వాపోతున్నారు.