
వ్యాపారులకు వరం.. రైతుకు నష్టం
మోర్తాడ్(బాల్కొండ): మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో వ్యాపారుల పాలిట వరంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు ధరను పట్టించుకోకుండా విక్రయిస్తూ నష్టపోతున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌లకు మక్కల ఎగుమతి సాగుతున్నా వ్యాపారులు ధర పెంచడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను అమలు చేస్తూ కొనుగోళ్లు ఆరంభిస్తేనే వ్యాపారులు ధర పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మద్దతు ధరతోనే మేలు..
జిల్లాలో ఈ సీజన్‌లో సోయా కంటే మొక్కజొన్న పంటను రైతులు అధికంగా సాగు చేశారు. గతంలో మార్క్‌ఫెడ్ సంస్థ సహకార సంఘాల ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. ఈసారి కూడా కొనుగోళ్లు ఆరంభిస్తే మక్కలకు మద్దతు ధర లభిస్తుందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేశ్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును స్వయంగా కలిసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలిస్తుండడంతో మక్కల విక్రయాలకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే కొనుగోలు కేంద్రాలను ఆరంభించాలని కోరుతున్నారు. కాగా, అన్వేశ్‌రెడ్డి వినతి మేరకు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలెం నుంచి
ఎగుమతి అవుతున్న మక్కలు
ప్రతిపాదనలు పంపించాం
మక్కలకు మార్కెట్‌లో మద్దతు ధర కంటే తక్కువ పలుకుతుంది. రైతులు నష్టపోతున్నారని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అను మతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.
– మహేశ్ కుమార్, మార్క్‌ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్
52 వేల ఎకరాల్లో సాగు..
ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 52 వేల ఎకరాలకు మించి రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రభుత్వం మక్కలకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 కాగా, మార్కెట్‌లో మాత్రం రూ.2 వేలకు మించడం లేదు. ఒక్కో క్వింటాలుకు రైతులు రూ.400 వరకు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే మార్కెట్‌లో కనీసం మక్కలను రూ.2,300 వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులకు తామే దిక్కు అనే ధీమా వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.
మక్కల కొనుగోలు కేంద్రాల్లేక
అన్నదాతల ఇబ్బందులు
ఎగుమతులు ఉన్నా ధర తగ్గించిన
వ్యాపారులు
క్వింటాలుకు రూ.2 వేలకు మించని ధర

వ్యాపారులకు వరం.. రైతుకు నష్టం